18 ఫిబ్ర, 2012

వైయస్ జగన్, వైయస్ కాల్ లిస్టుల విశ్లేషణలో సిబిఐ

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ సెల్‌ఫోన్ నెంబర్ల కాల్ లిస్టులను విశ్లేషిస్తున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. 2004 నుంచి 2009 వరకు వీరిద్దరూ వాడిన మూడు సెల్‌ఫోన్ నెంబర్లకు సంబంధించిన కాల్‌లిస్టును ఒక సర్వీసు ప్రొవైడర్ నుంచి సీబీఐ కోరినట్లు సమాచారం ఉందని ఆ పత్రిక రాసింది.

ఆ పత్రిక కథనం ప్రకారం - జగన్ ఎవరెవరితో సంభాషణలు జరిపారు, వైఎస్ ఏయే కంపెనీల అధినేతలతో మాట్లాడారనే విషయాలను నిర్ధారించుకోవడం ద్వారా కంపెనీల బాధ్యులను సీబీఐ ప్రశ్నించే అవకాశాలు కన్పిస్తున్నాయి. జగన్ కంపెనీల్లో కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టిన పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన వారు ఏ రోజు ఎన్నిసార్లు నేరుగా వైఎస్, జగన్‌లతో మాట్లాడారనే దానిపై స్పష్టత వస్తే తదుపరి దర్యాప్తు వేగవంతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జగన్ కేసులో తన ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్న వారందరి ఫోన్ నెంబర్లను జగన్, వైఎస్ కాల్‌లిస్టులతో పోల్చి చూసే ప్రయత్నాల్లో సీబీఐ ఉన్నట్లు తెలుస్తోంది.