16 ఫిబ్ర, 2012

బెదిరిస్తోందంటూ మోనికా బేడీపై పోలీసులకు ఫిర్యాదు

ముంబై: డబ్బుల కోసం తనను బెదిరిస్తోందంటూ దర్శకుడు ఆకాష్ పాండే ముంబైలో ఓషివారా పోలీసు స్టేషన్‌లో నటి మోనికా బేడీపై గురువారం ఫిర్యాదు చేశారు. ఎస్ఎంఎస్‌ల ద్వారా మోనికా బేడీ బెదిరిస్తోందని, డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తానని బెదిరిస్తోందని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. మోనికా బేడీ నేపథ్యం వల్ల తాను భయపడాల్సి వస్తోందని ఆయన అంటున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ కాదని ఆయన అంటున్నారు. 

కాంట్రాక్టు మేరకు మోనికా బేడీకి తాను ఫీజు కింద 4 లక్షల రూపాయలు, కాస్ట్యూమ్స్‌ కోసం మూడు లక్షల రూపాయలు, నేపాల్‌కు ఆమెతో పాటు వచ్చే ఆమె సిబ్బంది కోసం 1.75 లక్షలు రూపాయలు చెల్లించాలని, భారతదేశంలో సినిమా విడులైతే మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామని ఆయన వివరించారు. 

భారతదేశంలో సినిమా విడుదల కాక ముందే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మోనికా డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. తాము చెప్పినా వినడం లేదని, నిరంతరాయంగా ఎస్ఎంఎస్‌లు ఇస్తూ వేధిస్తోందని, బెదిరిస్తోందని ఆయన అన్నారు. అయినా డబ్బులు ఇవ్వాల్సింది తాను కాదని, నిర్మాత చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆ ఫిర్యాదు గురించి తనకేమీ తెలియదని, తాను ఎవరికీ ఎస్ఎంఎస్‌లు పంపించలేదని, అవన్నీ ఊహాగానాలేనని మోనికా బేడీ అంటున్నారు.