24 ఫిబ్ర, 2012

ఫస్టాఫ్ ఇష్క్..సెకండాఫ్ కిసుక్కు(రివ్యూ)

వరస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ సినిమా అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఏముంటుంది. అంత రిస్క్ చేసి వెళ్లటం ఎందుకు...ఏ టీవిల్లోనో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే వారికి..నిత్యామీనన్,పిసి శ్రీరామ్ ఇద్దరూ మేమున్నాం..డోంట్ వర్రీ అంటూ ధైర్యం చెప్పి జనాల్ని ధియోటర్ కి లాక్కొచ్చారు. అలాగే తమను నమ్మి వచ్చిన వాళ్లను నిరాశపరచకుండా సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టారు. ఫస్టాఫ్ నీట్ లవ్ స్టోరీతోనూ,సెకండాఫ్ ఫన్ మైండ్ గేమ్ తో సేఫ్ గేమ్ ఆడిదర్శకుడు నితిన్ ని ఒడ్డున పడేసాడు. అయితే ఫస్టాఫ్ ఉన్నట్లు సెకండాఫ్ కూడా ఉంటే మరింత ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామిడీగా ఉండి మరింత బావుండేది. 

ఎప్పుడూ సరదాగా నవ్వుతూ,నవ్విస్తూ తిరిగే రాహుల్(నితిన్)కి ప్లైట్ ప్రయాణంలో ప్రియ(నిత్య మీనన్)పరిచయమవుతుంది. అక్కడనుంచి అనుకోని పరిస్ధితుల్లో ప్లైట్ గోవాలో ల్యాండ్ అయ్యి వీరి పరచయాన్ని ప్రేమగా మార్చేస్తుంది. ఇద్దరూ అలా ప్రేమలో మునిగి తేలుతుండగా ప్రియ అన్న సూర్య(అజయ్)ద్వారా ట్విస్ట్ పడుతుంది. సూర్య గతంలో రాహుల్ అక్క(సింధు మీనన్)ని ప్రేమించమని టార్చర్ పెట్టి.. రాహుల్ చేతిలో దెబ్బ తిని ఉంటాడు. ఆ దెబ్బ మనస్సులో పెట్టుకున్న వీరి ప్రేమ కథను ఏమి మలుపు తిప్పుతాడు..ఎలా రాహుల్, ప్రియలు ఒకటయ్యారు అనేది మిగతా కథ. 

ఫస్టాఫ్ మొత్తం ప్రెష్ గా వచ్చే లవ్ సీన్లతో నడిచే ఈ చిత్రం ఇంటర్వెల్ అయ్యిన దగ్గరనుండి ప్రేమ కథ మలుపు తీసుకుంటుంది. అయ్యితే మామూలుగా ప్యూర్ లవ్ స్టోరోలలో కథ ఆ ప్రేమికుల ఇద్దరి మధ్యనే నడుస్తుంది. వారిద్దరి మధ్యన వచ్చే మనస్పర్దలో మరొకటో అడ్డుగా మారి చివరకు వాటిని దాటటంతో ముగుస్తాయి. అయితే దర్శకుడు పూర్తిగా తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథను తయారుచేసుకున్నట్లున్నాడు. ఇక్కడ మన రెగ్యులర్ స్కీమ్ అయిన హీరోయిన్ ప్యామిలీని మైండ్ గేమ్ తో ఒప్పించి హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే కోణంలోనే కథ నడిపాడు. దాంతో సెకండాఫ్ లో లవ్ ఫీల్ తగ్గి డెప్త్ మిస్సై కేవలం కామిడీతో సీన్స్ నడుస్తూ క్లైమాక్స్ ని చేరుకున్నాయి. అయితే ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ తరహాలో వేసిన సీన్స్ మాత్రం బాగా పండాయి. డైలాగులు కూడా కథనానికి ఊపునిచ్చాయి.

నటీనటుల్లో నితిన్ చాలా కాలం తర్వాత బాగా చేసాడు. అలాగే కాస్త ఒళ్లు చేసి నిండుగా ఉన్నాడు. నిత్యామీనన్ లోపలనుంచి నటన పొంగుకొస్తున్నట్లుగా స్క్రీన్ పై రెచ్చిపోయి చేసేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజయ్ డిఫెరెంట్ గా చేసాడు. ఇక అలీ,త్రాగుబోతు రమేష్,శ్రీనివాస రెడ్డి ఉన్నంతసేపు నవ్వించటానికి ట్రై చేసారు. హీరోయిన్ తండ్రిగా నాగినీడు ఓకే అనిపిస్తాడు. ఇక ఛాయాగ్రహణం గురించి కొత్తగా చెప్పుకునేదేమీలేదు. పిసి శ్రీరామ్ ని ఎంత కాస్ట్ అయినా భరించి ఎందుకు పెట్టుకోవాలనుకుంటారో ఈ సినిమా చూస్తే అర్దమవుతుంది. ఎడిటింగ్ మరింత షార్పుగా చేసి ఉండాల్సింది. సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి. రీ రికార్డింగ్ కొన్ని సీన్స్ లో అదరకొట్టింది. దర్శకుడు విషయానికి వస్తే 13బి వంటి హర్రర్ జనర్ సినిమా తీసిన తర్వాత ఇలాంటి మంచి లవ్ ఎంటర్టైనర్ తీస్తారని ఎవ్వరూ ఊహించరు. నిర్మాణ విలువలు ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తాయి. ఇక దర్శకుడు చివరలో ఎ పిలిమ్ బై..విక్రమ్ కుమార్ అండ్ టీమ్ అని వేసి తన టీమ్ కు కూడా గౌవరం ఇవ్వటం అతనిలోని సంస్కారానికి నిదర్సనం. 

ఫైనల్ గా కథ,కథనాలు రొటీన్ గా ఉన్నా ఎంటర్టైన్మెంట్ తో చేసిన ట్రీట్ మెంట్ సినిమాకు నిలబెట్టింది. కేవలం యూత్ కే కాక ఫ్యామీలీలు సైతం ఎంజాయ్ చేసాలా ఉన్న ఈ సినిమా వారికి పడితే మంచి రేంజికి వెళుతుంది. అయితే సినిమా అర్బన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నట్లుగా బి,సి సెంటర్లను రీచ్ అవుతుందా అనేది చూడాలి.