28 ఫిబ్ర, 2012

రష్యా ప్రధాని పుతిన్ హత్యకు కుట్ర, ఇద్దరి అరెస్టు

మాస్కో: రష్యా ప్రధాని వ్లదిమీర్ పుతిన్ హత్యకు కుట్ర జరిగింది. రష్యా, ఉక్రెయిన్ భద్రతా సంస్థలు కుట్రను తిప్పికొట్టాయి. పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ ఈ విషయం చెప్పారు. మార్చి 4వ తేదీన అధ్యక్ష ఎన్నికల తర్వాత పుతిన్‌ను మాస్కోలో హత్య చేయడానికి పథకం రచించారని, ఇందుకు సంబంధిచి ఇద్దరు మిలిటెంట్లను ఉక్రెయిన్‌లో అరెస్టు చేశారని రష్యా ప్రభుత్వ టీవి చానెలస్ వన్ టెలివిజన్ తెలిపింది. ఇద్దరిలో ఒక్కరిని ఒడెస్సాలో గత నెలలో అరెస్టు చేసినట్లు ఆ చానెల్ తెలిపింది. చెచెన్ తిరుగుబాటు నాయకుడు డోకు ఉమరోవ్ ఆదేశాల మేరకు ఈ ఇద్దరు పుతిన్ హత్యకు కుట్ర చేశారని చెప్పింది. 

ఉక్రెయిన్ ప్రభుత్వ భద్రతా సర్వీసు జనవరి 6వ తేదీన రష్యాను అప్రమత్తం చేసింది. ఒడెస్సాలోని నివేశన భవనంలో పేలుడు సంభవించిన తర్వాత పుతిన్ హత్యకు సంబంధించిన కుట్ర బయటపడింది. పుతిన్‌ను హత్య చేయడానికి ఆత్మాహుతి సభ్యుడిని గానీ ల్యాండ్ మైన్‌ను గానీ వాడాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. భవనం పేలుడులో పుతిన్ హత్యకు కుట్ర చేసిన ఒకతను మరణించాడని ప్రభుత్వ చానెల్ తెలిపింది.