26 ఫిబ్ర, 2012

రాంగోపాల్ వర్మ "రెడ్డిగారు పోయారు"లో హీరోలెవరు..?! విలన్లెవరు..?!!

"నాకు రాజకీయాల మీద ఎప్పుడూ ఆసక్తి లేదు కానీ, రాజకీయ నాయకుల సైకాలజీని స్టడీ చెయ్యటం పట్ల ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి ఉండేది. ఒక చిన్న రాయిని నిలకడగా ఉన్న నీళ్ళలో వేస్తే అది చిన్న చిన్న అలలను సృష్టిస్తుంది, కానీ అదే రాయిని నిలకడగా ఉన్న రాజకీయ నీళ్ళలో వేస్తే ఏకంగా ఒక సునామీనే సృష్టిస్తుంది.

ఈమధ్య కాలంలో కేవలం ఒక్క వ్యక్తి చనిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన భీకర ప్రకంపనాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న కనీవినీ ఎరుగని రాజకీయ పరిణామాలతో పాటుగా, ఆ నేపధ్యంలో జరిగిన అనేక స్కాములు, మీడియా ఛానల్స్ యుద్దాలు నన్ను అత్యంతంగా ప్రభావితం చేశాయి. 

నేను వాటన్నింటి ఆధారంగా ఒక కల్పిత కథ ద్వారా వాటి నగ్నత్వాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాని నా ప్రస్తుత చిత్రం డిపార్ట్‌మెంట్ పూర్తయ్యాక, వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాను. ఈ సినిమా టైటిల్... “రెడ్డి గారు పోయారు”

ఈ చిత్ర కథలో ఒక మహా నాయకుడు అకస్మాత్తుగా పోవటం మూలంగా ఒక రాజకీయపు ఉనికి పోరాటం మొదలవుతుంది. ఆయనగారి 'వాళ్ళు', ఆయన చావుని తమ ఉనిక్కి పెట్టుబడిగా పెట్టుకోవాలనుకుంటారు. ఆయనగారి 'కాని వాళ్ళు' ఆయన చావుతో తాము ఎదురు చూస్తున్న ఉనికిని సంపాదించాలనుకుంటారు. పదవులు అడ్రస్సులు మార్చుకుంటాయి. అడ్రస్సులు పదవుల్ని వెతుక్కుంటూ వెళతాయి. 

అలాగే అడ్రస్సులు కూడా లేని వాళ్ళు పదవుల్లోకి రావటం మొదలు పెడతారు. పదవులు లేని వాళ్ళు అడ్రస్సుల కోసం నమ్మించటం అనే పెట్టుబడులు పెట్టడం మొదలుపెడతారు. 'తన పైన ఎంత తక్కువ మంది ఉన్నారో, తన కింద ఎంత ఎక్కువ మంది ఉన్నారో' అనే వైకుంఠపాళీ ఆడాలనే ఒక దుష్ఠ వ్యసనానికి ఆయన గారు పోవడం ఒక కొత్త ఊపిరినిస్తుంది. 

రాజకీయ రంగుల భూకంపాన్ని సృష్టించిన ఆ సంఘటన, ఆ పర్యవసానాలు ఈ కథకి ఇతివృత్తాలు. విప్పలేనన్ని వ్యూహ ప్రతివ్యూహాలను మొత్తంగా విడమరచి నగ్నం చేసే ప్రయత్నమే నా సినిమా "రెడ్డి గారు పోయారు". - రాంగోపాల్ వర్మ