25 ఫిబ్ర, 2012

జగన్ కంపెనీలో పెట్టి మోసపోయా?:మాధవ్ వాంగ్మూలం

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లుగా మాధవ్ రామచంద్రన్ సిబిఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన వద్ద ఉన్న సొమ్మే కాక స్నేహితుడి వద్ద రుణంగా రూ.10 కోట్ల దాకా తీసుకొని జగతిలో పెట్టుబడులు పెట్టినట్లుగా చెప్పారని తెలుస్తోంది. ఆ తర్వాత తన పెట్టుబడిని వెనక్కి ఇవ్వమని కోరినా స్పందించక పోవడంతో తాను మోసపోయానని తెలుసుకున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ కలిసిన తనను జగతిలో పెట్టుబడులు పెట్టమని చెప్పినట్లుగా ఆయన వాంగ్మూలంలో ఉన్నదని తెలుస్తోంది.

కాగా ఎ.కె.దండమూడి వ్యక్తిగత హోదాలు రూ.5 కోట్లు పెట్టుబడులు పెట్టారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వీరిద్దరినీ నిందితుల జాబితాలో చేర్చింది. మాధవ్ రామచంద్రన్ ను 65వ, దండమూడిని 62వ నిందితుడిగా చేర్చారు. దండమూడిని ఇదివరకే సిబిఐ అధికారులు పలుమార్లు విచారించారు. మాధవ్ రామచంద్రన్ బెంగళూరుకు చెందిన ప్రవాస భారతీయుడు. ఆయన దుబాయ్ లో ఉంటున్నారు. జగతిలో ఆయన సుమారు రూ.20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు.