26 ఫిబ్ర, 2012

వైయస్ జగన్ అరెస్టు ఖాయం: మరోసారి విహెచ్ ఫైర్

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు కావడం ఖాయమని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. జగన్‌పై ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మరోసారి మండిపడ్డారు. సత్యం రామలింగరాజు మాదిరిగా వైయస్ జగన్ తప్పులు ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో జగన్ చెప్పాలని, నిజాలను జగన్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశాన్ని దోచుకున్న జగన్ వెంట ఎవరూ నడవవద్దని, జగన్‌తో నడిచేవారికి చివరకు ఏమీ మిగలదని ఆయన అన్నారు. తనతో నడిచివారిని జగన్ జైలు పాలు చేశాడని ఆయన అన్నారు. 

జగన్ మాదిరిగానే వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని, వైయస్ బాధితుల్లో తాను ఒక్కడినని, మరో బాధితుడు విజయభాస్కర్ రెడ్డి అని ఆయన అన్నారు. జగన్ వెంట నడిచే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జగన్ తెచ్చేది రామరాజ్యం కాదని, రావణ రాజ్యమని ఆయన అన్నారు. జగన్ చరిత్ర ప్రజలకు తెలుసునని, వచ్చే ఎన్నికల్లో దోచుకున్నవారిని ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.