18 ఫిబ్ర, 2012

స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్... కుర్రహీరోల మధ్య స్టార్‌డమ్ పోటీ...!!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ల తర్వాత అంతటి స్టామినాను సాధించిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ స్టార్ ఇమేజ్ కోసం చిరంజీవి చాలానే హార్డ్ వర్క్ చేశారు.. రిస్కీ ఫీట్లూ చేశారు. అప్పటితరం ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాతి తరం సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి నటుల మధ్య రాణిస్తూ మాస్ హీరోగా ఎదిగారు. మెగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చుకున్నారు. 

ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ కోసం పోటీ పెరిగినట్లు కనబడుతోంది. గత కొన్ని రోజులుగా ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ అంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. దీన్ని నిజం చేస్తూ ఇటీవల టైమ్స్ మేగజైన్ చేపట్టిన ఓ సర్వేలో "వాంఛిత హీరో"ల లిస్టులో మహేష్ బాబు టాప్ 5గా నిలిచారు. దీంతో మహేష్ బాబు సూపర్ స్టారే కాదు... ఏకంగా మెగాస్టారే అని వాదిస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్.
అడ్డు తగులుతున్న మెగా ఫ్యాన్స్... 
ఈ కార్డు మా మెగా హీరోలదే అంటున్నారు మెగా అభిమానులు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ మగధీరతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను షేక్ చేశారనీ, తాజాగా రచ్చతో మరోసారి టాలీవుడ్ పరిశ్రమను ఓ ఊపు ఊపేందుకు వస్తున్నాడని అంటున్నారు. ఈ దెబ్బతో గతంలో కుర్ర హీరోలు నెలకొల్పిన రికార్డులన్నీ బద్ధలవుతాయని వాదిస్తున్నారు. కనుక మెగాస్టార్ అనేది రామ్ చరణ్ తేజకు మాత్రమే దక్కుతుందన్నది వారి వాదన. 

Ramcharan
WD


మరి జూనియర్ ఎన్టీఆర్... నాగచైతన్య... రానాల మాటేంటి..? 
ఇలా స్టార్ ఇమేజ్ కోసం అటు మెగా ఫ్యాన్స్ ఇటు ప్రిన్స్ ఫ్యాన్స్ గడబిడ చేస్తున్నారు. వాళ్ల సంగతి అలావుంటే... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ మహారాజ అని పిలిపించుకుంటున్న రవితేజ, రాణిస్తున్న నాగ చైతన్య, రానా వంటి యూత్ హీరోల ఇమేజ్ ఏ దశలో ఉన్నదీ..? వీరి పేర్లకు ముందు టైగర్.. లవర్ బాయ్, జంటిల్మేన్ వంటి టాగ్‌లు కాకుండా సూపర్ స్టార్, మెగాస్టార్ బిరుదులేమీ రావా..? అంటే.. వారి స్టామినా ఇక ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా..? సూపర్ స్టార్ బిరుదు.. ప్రిన్స్ ఫ్యామిలీ పంచేసుకుంటే.. మెగాస్టార్ బిరుదును మెగా కుటుంబం అట్టే పెట్టేసుకుంటుందా..? యూత్ హీరోల స్టామినా వారికి మించి పోలేదా..? ఇత్యాది ప్రశ్నలపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

చూద్దాం... చటుక్కున సినీ వారసత్వ కుటుంబాల నుంచి కాకుండా సొంత స్టామినాతో అందరి ఇమేజ్ లను డౌన్ చేసి దూసుకెళ్లగల హీరో ఎవరైనా వస్తారేమో...? అలా వచ్చినవారే కదా.. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. చిరంజీవి.