22 ఫిబ్ర, 2012

'వైయస్సార్ మౌఖికంగా చెప్పారు, జగన్ సాక్షికి ఇచ్చాం?'

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాకు వచ్చిన ప్రభుత్వ ప్రకటనల వైనంపై సిబిఐ అధికారులు సమాచారశాఖ అధికారులను మంగళవారం నిశితంగా ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీనియర్ ఐఏఎస్, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ పార్థసారథిని సిబిఐ అధికారులు మంగళవారం సుమారు మూడు గంటల పాటు విచారించారు. సమాచారశాఖలో డిప్యూటి డైరెక్టర్‌గా చేసి పదవీ విరమణ చేసిన ప్రభాకర రావు, ప్రస్తుత డిప్యూటి డైరెక్టర్ రాజ బాబును ఒకేచోట కూర్చోపెట్టి సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సమాచారశాఖ కమిషనర్, ఇతర అధికారులు ప్రతిరోజూ ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగలకు సంబంధించిన ప్రకటనలపై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారని వీరు సిబిఐకి వెల్లడించారని సమాచారం. గతంలో పార్థసారథి సమాచార శాఖ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో జగన్‌కు చెందిన దిన పత్రిక, టెలివిజన్‌కు భారీగా ప్రకటనలు జారీ అయ్యాయి. 
అప్పుడే ప్రారంభమైన పత్రికకు ఇతర పత్రికల కన్నా భారీ స్థాయిలో ప్రకటనలిచ్చిన అంశంపై సిబిఐ విచారణ జరుపుతోంది. 

ప్రభుత్వ ప్రకటనలు పత్రికలకు జారీ చేయడానికి ఏ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? లేదా పెద్దలు ఎవరైనా నేరుగా చెబితే నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు జారీ చేస్తారా? అప్పట్లో జగన్ పత్రిక ప్రకటనల విషయంలో సమాచార శాఖపై వైఎస్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అన్న విషయాలను సిబిఐ అధికారులు తెలుసుకున్నట్లు సమాచారం. సమాచార శాఖ కమిషనర్, ఇతర అధికారులు ప్రతిరోజు ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని, ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగలకు సంబంధించిన ప్రకటనలపై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారని వీరు వివరించినట్లు తెలుస్తోంది. ఒకే విధమైన సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికలకు ఒకే విధమైన స్పేస్‌తో ప్రకటన ఎందుకు జారీ చేయలేదు? ఒక పత్రికకు సగం పేజీ ప్రకటన ఇస్తే, జగన్ మీడియా సంస్థకు మాత్రం పూర్తి పేజీ ప్రకటన ఇవ్వడానికి కారణం ఏమిటి? ఈ నిర్ణయం వెనుక పెద్దల ఆదేశాలేమన్నా ఉన్నాయా? అన్న కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఒకే స్థాయిలో సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికల మధ్య రెండేళ్లలో ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి రూ.ముప్పై కోట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చిందనే విషయాలను తెలుసుకోవడానికి సిబిఐ అధికారులు ఎక్కువగా ప్రయత్నించినట్లు తెలిసింది. పార్థసారథిని విచారించడానికి ముందు జగతి పబ్లికేషన్స్‌లో ప్రకటనల విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు బాధ్యులను సిబిఐ అధికారులు పిలిపించి విచారించారు. జగన్ పత్రికకు జారీ చేసిన ప్రకటనలు ఏ ఉద్దేశంతో జారీ అయ్యాయో తెలుసుకునే ప్రయత్నం సిబిఐ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా వాన్ పిక్ ప్రాజెక్టు ప్రతినిధులను సిబిఐ అధికారులు మంగళవారం విచారించారు. వాన్ పిక్ ప్రతినిధులు రెండుసార్లు సిబిఐ ముందు హాజరయ్యారు.