21 ఫిబ్ర, 2012

ఆ చిత్రం చేయటం తప్పే అంటూన్న సూపర్ స్టార్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్,ఐశ్వర్యారాయ్ కాంబినేషన్ లో అప్పట్లో సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆ చిత్రం కమర్షియల్ గానూ,క్రిటికల్ గానూ ఫెయిల్యూర్ అయ్యింది. ఈ విషయాన్ని చాలా కాలం తర్వాత షారూఖ్ ఖాన్ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ...‘దేవదాస్’ చిత్ర రీమేక్‌లో నటించడం పెద్ద తప్పని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అభిప్రాయపడ్డారు. దేవదాస్ రీమేక్‌లో నటించడం తన అవివేకమని ఆయన అన్నారు. ‘ది డైలాగ్ ఆఫ్ దేవదాస్’ అనే పుస్తక అవిష్కరణ కార్యక్రమంలో షారుఖ్ మాట్లాడుతూ.. దిలీప్ సాహెబ్‌ను అనుకరించడం ఎవరివల్లా కాదని.. తాను ఆ చిత్రంలో నటించకుండా ఉంటే బాగుండేదన్నారు. 

1955 సంవత్సరంలో నిర్మించబడిన దేవదాస్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బీమల్ రాయ్ దర్శకత్వం వహించారు. దేవదాస్ చిత్రానికి సంబంధించిన డైలాగ్స్‌కు రాజిందర్ సింగ్ బేడి పుస్తక రూపం కల్పించారు. అందరి తల్లుల లానే తన తల్లి కూడా ఇష్టపడిందని.. దిలీప్‌లా కనిపించావని అయితే దిలీప్ సాహెబ్‌లా నటించలేదని తెలిపారని బాలీవుడ్ బాదుషా అన్నారు. తాను ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొనడం వల్ల తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుందని షారుఖ్ వ్యాఖ్యానించారు. ఆనారోగ్య కారణంతో ఈ కార్యక్రమానికి హాజరుకాని దిలీప్ సాహెబ్ పంపిన లేఖను షారుఖ్ చదివి వినిపించారు.