14 ఫిబ్ర, 2012

వైయస్ జగన్ వ్యూహం: కిరణ్ కుమార్ రెడ్డికి దెబ్బే

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నష్టం చేసేదిగానే ఉంది. ఈ నష్టం బయటకు కనిపించకపోయినా ప్రజల్లో పలుచబారే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ సాక్షిగా వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం వల్లనే జాప్యం జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చి వారిపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేయిస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కోలేని ఆసహాయతే కిరణ్ కుమార్ రెడ్డి అలా చేస్తున్నారనే ప్రచారం కూడా ముమ్మరంగానే సాగుతోంది. ఇది ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెసు పార్టీకి మైనస్ అవుతుందని అంటున్నారు. 

అదంతా ఒక ఎత్తయితే, వైయస్సా కాంగ్రెసు పార్టీ కండువాలు వేసుకుని, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు శాసనసభకు హాజరు కావడం కిరణ్ కుమార్ రెడ్డిని మరింత ఆత్మరక్షణలోకి పడేసిందని అంటున్నారు. ఇంత బాహాటంగా వారు ధిక్కారానికి పాల్పడుతుంటే చర్యలు తీసుకునే విషయంలో జాప్యం చేయడం ప్రస్తుతానికి ఏం ప్రయోజనం చేకూరుతుందో గానీ, భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీకి నష్టం చేస్తుందని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని వైయస్ జగన్ సమర్ధంగా ఎదుర్కుంటున్నారనే మాట కూడా వినిపిస్తోంది. 

కాగా, వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల కాంగ్రెసుకు చెందిన కొంత మంది సీనియర్ నాయకులు కూడా తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారు. ఇది పార్టీకి నష్టం కలగజేస్తుందని, నైతికంగా దెబ్బ తింటామని వారంటున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటుకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. కానీ, ముఖ్యమంత్రే కావాలని జాప్యం చేయిస్తున్నారని, రాష్టంలో 24 శాసనసభా స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలను ఎదుర్కోవడాన్ని దాటేయడానికే అలా చేస్తున్నారని అంటున్నారు. ఇటువంటి ప్రచారం వల్ల కాంగ్రెసు బలహీనంగా ఉందనే సంకేతాలు ప్రజల్లోకి ఇప్పటికే వెళ్తున్నాయి. మరింత జాప్యం జరిగితే కాంగ్రెసుకు మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు. స్పీకర్‌పై మరింత ఒత్తిడి పెట్టడానికి వైయస్ జగన్ ఈ నెల 16వ తేదీన తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమవుతున్నారు.