25 ఫిబ్ర, 2012

ఆళ్లగడ్డలో పడగవిప్పిన ఫ్యాక్షన్ భూతం

ఆళ్లగడ్డ(కర్నూలు), న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంట గ్రామంలో శుక్రవారం రాత్రి వర్గకక్షలకు ముగ్గురు బలయ్యారు. గ్రామంలో కొంతకాలంగా ఉన్న విభేదాలు తీవ్రరూపం దాల్చి హత్యలకు దారితీశాయి. ఈ దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఇంజేటి కృష్ణారెడ్డి(50), ఆయన భార్య గోవిందమ్మ(48), ఆయన ప్రధాన అనుచరుడు దుబ్బేగ(45) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డి కుమారుడు మల్లికార్జునరెడ్డి, మామ సుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి 11 గంటల సమయంలో కృష్ణారెడ్డి ఇంటి గేటును ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి లోపలికి ప్రవేశించి కత్తులతో తెగబడ్డారు. క్షణాల్లో మారణాయుధాలతో దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపారు. ముగ్గురి మృతదేహాలు ఇంట్లో రక్తపుమడుగులో చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. పదిమందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సుధాకర్‌రెడ్డి, టౌన్ ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.