26 ఫిబ్ర, 2012

సినిమా రిలీజ్ రోజు పది ప్రేమ జంటలకు పెళ్లిళ్లు

న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రేమించుకున్న పది ప్రేమ జంటలకు మా సినిమా విడుదల రోజున పెళ్ళి చేయాలని నిర్ణయించా. ఆ పది జంటల్లో ఉత్తమ ప్రేమజంటకు బహుమతి కూడా ఇస్తాం అంటున్నారు చరణ్ రాజ్. నటుడు, దర్శకుడు చరణ్‌రాజ్ పది ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నారు. తను డైరెక్ట్ చేసిన 'యథార్థ ప్రేమకథ' చిత్రం విడుదల రోజు హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఉదయం ఈ పెళ్లిళ్లు చేస్తామని ఆయన ప్రకటించారు. నూతన తారలు అమర్, చిరి జంటగా సి.ఆర్.క్రియేషన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో ఆయన 'యథార్థ ప్రేమకథ'ను రూపొందించారు. మార్చి ప్రథమార్థంలో ఈ సినిమాని విడుదల చేస్తామని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "కొంత కాలం క్రితం వార్తలకెక్కిన నాగరాజు, అనిత ప్రేమకథలోని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించా. 

అలాగే ఆ సినిమా విడుదల రోజు ఇదే బేనర్‌లో 'జెంటిల్‌మన్ పోలీస్' అనే సినిమాను నేను హీరోగా ప్రారంభించబోతున్నా. ఈ సినిమాని మంత్రాలయంలోని పోలీసులకు అంకితమిస్తాను అని చెప్పారు. ఈ సినిమాకి స్ఫూర్తిగా నిలిచిన నాగరాజు మాట్లాడుతూ తాను రాసిన అనితా ఓ అనితా పాటను ఎంతగా ఆదరించారో, అలాగే 'యథార్థ ప్రేమకథ' చిత్రాన్నీ అంతగా ఆదరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హీరో అమర్, ఆర్య సమాజ్ ప్రతినిథి శివాజీ పాల్గొన్నారు. సుత్తివేలు, నళిని, సుమన్‌శెట్టి, రాజు, నర్సింగ్ యాదవ్, శరత్‌చంద్ర, సాయిశంకర్, హర్ష, కీర్తి, ఆర్తీపురి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సి.వంశీకృష్ణ, కూర్పు: వి.నాగిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వ: చరణ్‌రాజ్.ఎస్.వై.