23 ఫిబ్ర, 2012

అర్జెంటీనాలో ఘోర రైలు ప్రమాదం : 49 మంది దుర్మరణం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 49 మంది మరణించగా, 600 మందికి పైగా గాయపడ్డారు. అర్జెంటీనాలో గడచిన 40 ఏళ్లలో ఇంత ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. 

బ్యూనస్ ఎయిర్స్‌లోని రైల్వే స్టేషన్లో ఉదయం వేళ అత్యంత రద్దీగా ఉన్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఒకటి ఫ్లాట్‌ఫామ్ అంచులను దాటి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. రైలులోని బ్రేకుల వ్యవస్థ విఫలం కావడమే ప్రమాదానికి కారణంగా అధికారులు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. 

ప్రమాదం తర్వాత పదుల సంఖ్యలో ప్రయాణికులు గంటల తరబడి రైలులో చిక్కుకున్నారు. వీరిని ఎట్టకేలకు వారిని సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రుల్లో చిన్నపిల్లల నుంచి పండు ముదుసలుల వరకు ఉన్నారు. ప్రమాదం పట్ల అర్జెంటీనా ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. 

సత్వరమే స్పందించిన అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో జరుగుతున్న వేడుకలను రెండు రోజుల పాటు రద్దుచేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.