28 ఫిబ్ర, 2012

దటీజ్ ఎన్టీఆర్ ‘దమ్ము’- ఉత్తరాంధ్ర రూ. 3.45 కోట్లు

త్వరలో విడుదల కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం విడుదలకు ముందే దుమ్ము రేపుతోంది. ఈ చిత్రం ఉత్తరాంధ్ర హక్కులు ఏకంగా రూ. 3.45 కోట్లకు అమ్ముడు పోయాయి. భరత్ పిక్చర్స్ అధినేత భరత్ భూషణ్ ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నాడు. కేవలం ఉత్తరాంధ్ర హక్కులే ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడయితే....నైజాం, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో ‘దమ్ము’ చిత్రానికి ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ?..అంటూ ట్రేడ్ వర్గాలు ఈ విషయమై ఆసక్తి కరంగా చర్చించుకుంటున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. దటీజ్ మా హీరో ఎన్టీఆర్ ‘దమ్ము’ అంటూ సంబర పడిపోతున్నారు. 

దమ్ము చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. జూనియర్ సరసన త్రిష, కార్తీక రొమాన్స్ చేస్తున్నారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రంలో నటించబోతున్నారు.

అంతే కాకుండా జూ ఎన్టీఆర్... కెఎస్. రామారావు నిర్మించే చిత్రంలోనటిస్తున్నారని, ఈ సినిమాకు సదరు నిర్మాత జూ ఎన్టీఆర్‌కు రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.