24 ఫిబ్ర, 2012

పనిమనిషికి 15 లక్షల డాలర్ల పరిహారం ఇవ్వాలి

న్యూయార్క్‌: భారత దౌత్య కార్యాలయంలో కౌన్సెలర్‌గా పనిచేసిన నీనా మల్హోత్రా.. 'వెట్టిచాకిరి' చేయించుకున్నందుకుగాను ఇంట్లో పనిమనిషికి 15 లక్షల డాలర్లు చెల్లించాలంటూ అమెరికా న్యాయమూర్తి సిఫార్సు చేశారు. నీనా మల్హోత్రా తనతో వెట్టిచాకిరి చేయించుకున్నారని, మానసికంగా హింసాంచారని పనిమనిషి శాంతి గురుంగ్‌ ఆరోపించారు. ఆమెకు తగినంత జీతం ఇవ్వకుండా ఎక్కువ గంటలు పనిచేసేలా మల్హోత్రా మూడేళ్ల పాటు ఒత్తిడి చేశారని అమెరికా మెజిస్ట్రేట్‌ న్యాయమూర్తి ఫ్రాంక్‌ మాస్‌ అభిప్రాయపడ్డారు. పనిమనిషి పత్రాలను లాక్కొని, ఎక్కడికీ వెళ్లనీయకుండా చేయటమే కాకుండా కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడటానికీ అనుమతించలేదని పేర్కొన్నారు. సరైన ఆహారం పెట్టకపోవటంతో ఆమె మూడేళ్లలోనే సుమారు 30 కిలోల బరువు తగ్గారనీ వివరించారు. మానసికంగా హింసించినందుకు ఆమకు మరో 5 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలనీ సిఫారసు చేశారు. కోర్టు పత్రాల ప్రకారం.. నీనా, ఆమె భర్త జోగేశ్‌ల కోరిక మేరకు శాంతి గురుంగ్‌ అమెరికాకు వచ్చారు. వంట చేయటం, బట్టలుతకటం, ఇంట్లో జరిగే వేడుకలకు సంబంధించిన పనులు చేసినందుకు ఆమెకు నెలకు సుమారు 108 డాలర్ల జీతం ఇచ్చేందుకు అంగీకరించారు.