22 ఫిబ్ర, 2012

మద్యం సిండికేట్లు, ఇది రూ. 15 వేల కోట్ల స్కామ్

హైదరాబాద్: మద్యం సిండికేట్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 15 వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని ఎసిబి కోర్టుకు తెలిపింది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయినవారికి బెయిల్ ఇవ్వవద్దని ఎసిబి తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయించి వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారని చెప్పారు. ఎమ్మిగనూరు సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయినవారి విషయంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలను వినిపించారు. ప్రజా ప్రతినిధులకు, ఆబ్కారీ అధికారులకు, పోలీసులకు ముడుపులు ముట్టాయని ఎసిబి ఆరోపించింది. 

మద్యం సిండికేట్ల వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు పెద్ద యెత్తున గండి కొట్టారని చెప్పింది. మద్యం సిండికేట్లకు సంబంధించి కొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది. అరెస్టయినవారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రైవేట్ వ్యక్తులు ఎసిబి చట్టం పరిధిలోకి రారని, అటువంటప్పుడు వారిని ఎసిబి ఎలా అరెస్టు చేస్తుందని, అటువంటి వారికి బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరఫు న్యాయవాది వాదించారు. 

కాగా, ఖమ్మం సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయిన నున్న రమణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై రేపు గురువారం విచారణ జరగనుంది.